
బాలయ్యపై పవన్ కల్యాణ్ ఓడిపోతారా: వేణుస్వామి ఏమన్నారంటే...
Recommended Video

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ టీవీ చర్చలో బాబు గోగినేని చేతిలో చిత్తయిన ఆయన తాజాగా పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేశారు.
గోగినేని బాబు చేతిలో చిత్తు: జ్యోతిష్కుడు వేణు స్వామి ఆటకట్టు
ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ9 చర్చా కార్యక్రమంలో ఆయన పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు. వేణు స్వామి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాలయ్య చేతిలో పవన్ ఓడిపోతారట..
పవన్ జన్మదినం ప్రకారం 2019లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని అంటూ హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పవన్ పోటీ చేయకపోవడమే మంచిదని వేణు స్వామి ఓ ఉచిత సలహా పారేశారు. పోటీ చేస్తే బాలయ్య చేతిలో పవన్ ఓడిపోతారని చెప్పారు.

పవన్ జాతకం ఇలా ఉందట.
పవన్ కల్యాణ్ 1971 సెప్టెంబర్ 2న ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారని, వ్యయంలో సూర్యుడు, శని, బుధుడు కనిపిస్తున్నారని వేణు స్వామి అంటూ మంచి నిర్ణయాలను తీసుకునే పరిపక్వతను బుధుడు ఇస్తాడని, శుక్రుడు కుటుంబ సమస్యలను చూపిస్తాడని అన్నారు.

పవన్ కల్యాణ్‌ది ప్రత్యేక మెంటాలిటీ..
బుధుడి కారణంగా పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకమైన మెంటాల్టీ ఉంటుందని, అయితే ఆ మెంటాల్టీ ఇతరులతో పొసగదని వేణు స్వామి చెప్పారు. పవన్ చుట్టూ ఒక్కరు లేదా ముగ్గురుకి మించి ఉండరని అన్నారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండో సారి ఏలినాటి శని ఉందని, రెండోసారి ఇది ఉన్నవారు ఎమ్మెల్యే, మంత్రి మాత్రమే కాగలుగుతారని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని అన్నారు.

అందుకని బాలయ్యదే గెలుపు...
బాలయ్యది మూలా నక్షత్రం, పవన్ ది ఉత్తరాషాఢ నక్షత్రమని వేణు స్వామి చెబుతూ ఈ కాంబినేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే నూటికి నూరు పాళ్లు బాలయ్యపై పవన్ పోటీకి వెళ్లే అవకాశం కూడా లేదని అన్నారు. అయితే, వేణు స్వామి జ్యోతిషుడు చెప్పేవి ఏ మాత్రం నిజం కావని హేతవాదులు అంటున్నారు. బాబు గోగినేనితో పాటు పలువురు వేణు స్వామి చెప్పిన విషయాలు ఎలా నిజం కాలేదో వివరాలతో సహా చెబుతూ వస్తున్నారు. వేణు స్వామిన నమ్మకూడదని కూడా అంటున్నారు.