యువతులను వ్యభిచారంలోకి దింపుతున్న దంపతులు
నల్లగొండ: యువతులను మభ్యపెట్టి, వ్యభిచార రొంపిలోకి దింపుతూ డబ్బులు సంపాయించడమే పనిగా పెట్టుకున్న భార్యాభర్తలను పోలీసులు పట్టుకున్నారు. వారి వ్యాపారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు సాగుతోంది. హైదరాబాద్ యువతులను విశాఖకు తరలించి వ్యభిచారంలోకి దింపడం పనిగా పెట్టుకున్నారు.
అయితే శనివారంనాడు హైదరాబాద్ నుంచి ఆరుగురు యువతులను విశాఖకు తరలిస్తుండగా వారి బాగోతం బయటపడింది. పోలీసులు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో దంపతులతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు. దంపతులు కొన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండ జిల్లా నుంచి విశాఖపట్నానికి వారు అమ్మాయిలను తరలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు భార్యాభర్తలమని చెప్పుకుంటున్నారని, అది ఎంత వరకు నిజమో తెలియదని పోలీసులు అంటున్నారు. సూర్యాపేట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీశారు.
విశాఖపట్నంలో ఓ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు వెళ్తున్నట్లు పోలీసులకు ఆ అమ్మాయిలు చెప్పారు. కానీ, కారులో కండోమ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులు కూడా కనిపించడంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. దాంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో వారిని పోలీసులు విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications