పవన్‌కు బ్రహ్మానందంతో క్లాసులు ఇప్పించండి-
Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.

ఈ సభపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దాదాపుగా రెండు గంటల పాటు పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రసంగం, చేసిన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు. సెటైర్లు సైతం సంధించారు. జనసేనను తెలుగుదేశం పార్టీకి బీ-టీమ్‌గా అభివర్ణించారు.
తాజాగా పవన్ కల్యాణ్ ప్రసంగంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడారు. ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తోన్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు.
తన సొంత పార్టీ జనసేన సభలో పవన్ కల్యాణ్.. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి వినిపించారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఓ పార్టీకి అధ్యక్షుడై ఉండీ మరో పార్టీ స్క్రిప్ట్‌ను చదవడం ఏమిటంటూ సెటైర్లు వేశారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దకూడదంటూ ఇక్కడి పార్టీలన్నీ డిమాండ్ చేస్తోంటే- ఆయన అదే కావాలనడం సరికాదని చెప్పారు.

త్రిభాషా విధానాన్ని దక్షిణాది పార్టీలేవీ వ్యతిరేకించట్లేదని, హిందీని బలవంతంగా రుద్దకూడదనేదే తమ డిమాండ్ అని రామకృష్ణ స్పష్టం చేశారు. తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తోన్నారంటూ ప్రశ్నించడంలో అర్థం లేదని చెప్పారు. హిందీకి బదులుగా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏదైనా ఒకదాన్ని నేర్చుకోమని చెప్పొచ్చు కదా..? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ పదే పదే సనాతన ధర్మం గురించి మాట్లాడటాన్ని రామకృష్ణ తప్పు పట్టారు. కాషాయం కప్పుకొని, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్నాడని చెప్పారు. సతీ సహగమనాన్ని, శూద్రుల చదువుకోకూడదని, అంటరానితనాన్ని ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని తేల్చి చెప్పారు.
సనాతన ధర్మం వల్ల కలిగే నష్టాల గురించి తనలాంటి వాళ్లు చెబితే పవన్ కల్యాణ్ వినరని, అందుకే- నటుడు బ్రహ్మానందం సరిపోతారని రామకృష్ణ చెప్పారు. ఇటవలే విజయవాడలో జరిగిన ఓ సభలో సనాతనం గురించి బ్రహ్మానందం చక్కగా వివరించారని గుర్తు చేశారు. ఈయనకు ఆయనతో క్లాసులు ఇప్పించాలని అన్నారు.












Click it and Unblock the Notifications