బాబూ! ఆలోచించు: హైకోర్టు షాక్‌పై చురక, 'తెలంగాణకు అలాగే చేశారా'
అనంతపురం/విజయవాడ: రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం పైన హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సిపిఐ నేత రామకృష్ణ సోమవారం నాడు చంద్రబాబు ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇప్పటికైనా స్విస్ విధానం పైన ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.
రాజధాని నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ నేతలకే కాదని, అందరికీ భాగస్వామ్యం ఉండాలని హితవు పలికారు. మెడికల్ సీట్ల కేటాయింపు పైన మంత్రి కామినేని శ్రీనివాస రావుతో తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
కాగా, ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అమ్మో బీజేపీ.. వాటినీ ప్యాకేజీలోనే!: రఘువీరా
రోడ్లకు ఇచ్చిన రూ.65వేల కోట్లను కూడా బీజేపీ ప్యాకేజీ లెక్కల్లో చూపిందని, ఇది విడ్డూరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు. రోడ్లకు తెలంగాణ, మహారాష్ట్లకు కూడా ఇచ్చారని, వాటిని కూడా అలాగే చూపించారా అని నిలదీశారు. అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు చంద్రబాబు అడిగారని, ఇప్పుడు ఏం ఇవ్వకపోయినా సంతోషిస్తారా అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదన్నారు. మంత్రివర్గ తీర్మానంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. బీజేపీ హోదా పైన అబద్దాలు చెబుతోందన్నారు. రూ.5700 కోట్లతో పోలవరం కాలువను కాంగ్రెస్ హయాంలో పూర్తి చేశామన్నారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి పోలవరాన్ని రాష్ట్రానికి అప్పగించిందని ఆరోపించారు. బీజేపీ ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అన్నారు.












Click it and Unblock the Notifications