ఇండియా కూటమిలోకి చంద్రబాబుకు నారాయణ ఆహ్వానం..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తంతు రేపటితో ముగియబోతోంది. ఏడు దశల్లో సాగిన ఎన్నికల్లో ఈసారి జాతీయ స్ధాయిలో ఇండియా కూటమికీ, ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఎన్డీయేను వీడి పలు మిత్రపక్షాలు విడిగా పోటీ చేయడమూ లేక ఇండియా కూటమిలో చేరిపోవడమో జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఎన్డీయేలో కీలక పార్టీగా మారింది.
ఇప్పటికే జాతీయ స్ధాయిలో వెలువడిన పలు సర్వేలు, సెఫాలజిస్టుల అంచనాల్లో ఈసారి ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్ధానాలు సాధించి రెండో స్ధానాల్లో నిలిచే అవకాశం టీడీపీకి ఉందని తేలింది. ఈ నేపథ్యంలో టీడీపీ సాధించే సీట్లపై జాతీయ మీడియా సంస్థలు కూడా ఫోకస్ పెట్టాయి. అయితే జాతీయ స్ధాయిలో మరికొన్ని సంస్థలు మాత్రం ఎన్డీయేకు ఈసారి కష్టమేననే అంచనాలు కూడా వెలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ ఇవాళ స్పందించారు.

ఒకవేళ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఓడిపోతే మాత్రం టీడీపీ ఇండియా కూటమిలో చేరి మద్దతివ్వాలని సీపీఐ నారాయణ ఆ పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ప్రస్తుతం ప్రధాని మోడీ మొహం చూస్తుంటే ఆముదం తాగినట్లు ఉందని, దాన్ని చూస్తుంటేనే ఆయన ఓడిపోతున్నారని అర్ధమవుతోందని నారాయణ సెటైర్లు వేశారు. కాబట్టి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వచ్చేందుకు సిద్ఘంగా ఉండాలని నారాయణ కోరారు. తాజాగా తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చింతామోహన్ సైతం ఏపీలో అన్ని పార్టీల ఎంపీలు ఇండియా కూటమిలోకి రావాలని కోరారు.












Click it and Unblock the Notifications