చంద్రబాబు అందుకే పరిమితమా - రామకృష్ణ..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం పాలన పైన మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం తాజాగా బడ్జెట్ లో ఏపీ కోసం ప్రకటించిన నిర్ణయాల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమరావతికి కేంద్రం రుణం ఇప్పిస్తామని చెప్పటం పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.
మోదీని కీర్తించేందుకే
సీపీఐ రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు ..ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై కామెంట్స్ చేసారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య అలానే ఉందని, బ్లాక్ మనీ వెలికి తీస్తామన్నారు.. అదీ చేయలేకపోయారని విమర్శించారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఇప్పించటానికి ప్రధాని, నిర్మలా సీతారామన్ కావాలా అంటూ ప్రశ్నించారు.

రుణం వాళ్లు ఇప్పించాలా
ప్రపంచ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వం అయినా రుణం తెచ్చుకోగలదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చెప్పేదానికి, జగన్ చెప్పేదానికి ఏమాత్రం పొంతన లేదని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర అప్పులపై స్పష్టత లేని ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారని వివరించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మీడియా సమావేశం పెట్టి వివరించాలని రామకృష్ణ డిమాండ్ చేసారు.
విచారణ చేయాలి
మదనపల్లెలో భూములు కబ్జా, పత్రాల దగ్ధం చేశారని, కడప జిల్లాలో కూడా లక్ష ఎకరాలపై చిలుకు భూములు కబ్జాకు గురయ్యాయని, దానిపై కూడా విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన భూములపై విచారణ జరిపించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ దగ్గర ఉన్న భూముల సమాచారం అందజేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన భూములపై విచారణ చేయాలని సీపీఐ రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.












Click it and Unblock the Notifications