రేవంత్ రెడ్డిని చూసైనా నేర్చుకో
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసైనా జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. రేవంత్ ముఖ్యమంత్రి అవగానే ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్లు తొలగించారని, ప్రజాదర్భార్ ఏర్పాటు చేశారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.11 కోట్ల ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చేశారని మండిపడ్డారు. నియంతలా వ్యవహరిస్తూ విధ్వంసక పరిపాలన చేస్తున్నాడన్నారు.
నాలుగున్నర సంవత్సరాలుగా వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అనుమతించలేదన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జయలలిత పేరుమీద ఉన్న పథకాలను అలాగే కొనసాగిస్తున్నారని, జగన్ తన వైఖరిలో ఇప్పటికైనా మార్పుతెచ్చుకోవాలన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీచేశాయని, తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో విజయం సాధించారని రామకృష్ణ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండటట్లు చూడాలని కోరారు.

విభజన చట్టంలోని హామీలను అమలు చేయడానికి కేంద్రం ఇంతవరకు ముందుకు రాలేదని, రేవంత్ రెడ్డి ఈ విషయమై చొరవ తీసుకొని హామీలను సాధించాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే ప్రజల కష్టాలు తీరవని, కరువుతో అవస్థలు పడుతుండగా, మరోవైపు తుఫాన్ తో చేతికి అందబోతున్న పంట కూడా పోయిందని, రైతులను ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications