అమరావతికి మరో భారీ రుణం, రైతులకు ప్యాకేజీ పై కీలక నిర్ణయం..!!
అమరావతి వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలపటం భూ సమీకరణ ప్రక్రియ మొదలైంది. ఇదే సమయంలో కీలక నిర్మాణాల కు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. కాగా.. రెండో విడత లాండ్ పూలింగ్ లో భూములు ఇస్తున్న రైతు ల ప్యాకేజీ పైన నిర్ణయం తీసుకుంది. ఇక, అమరావతికి మరో భారీ రుణ సేకరణకు ఆమోదం లభించింది. దీంతో.. కొత్త నిర్మాణాల పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
అమరావతి పైన వరుస నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రూ.169 కోట్లతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు సీఎం ఆమోదం తెలియజేశారు. జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు రూ.163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదించారు.

నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. కాగా, జనవరి కల్లా సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జాతీయ రహదారికి కలిపే ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు.
కాగా, మధ్యలో స్టీల్ వంతెనల ఏర్పాటు ద్వారా సీడ్ యాక్సిస్ రహదారి మంగళగిరి, జాతీయ రహదారికి అనుసంధానం కానుందన్నారు. రెండోదశ భూ సమీకరణపై సీఎం వద్ద చర్చ జరిగిందని, తొలి దశ రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే రెండో దశ రైతులకూ వర్తిస్తుందని వెల్లడించారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెండో విడత భూ సమీకరణలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లోని 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications