అమరావతిలో మరో 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం: అనుకున్నది అనుకున్నట్టుగా రావాలంటే..!!
Amaravati: రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది.
అమరావతిలో నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో.. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది.

ఈ పరిస్థితుల మధ్య రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (CRDA) సమావేశమైంది. ఇది- 50వ సమావేశం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటైన ఈ భేటీకి మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు.
రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన ఏడు అంశాలపై చర్చించారు. వాటి తీర్మానాలను ఆమోదించారు. మరో విడత భూ సమీకరణ, హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు, ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణం వంటివి ఉన్నాయి.
- రాజధాని పరిధిలోని అమరావతి- 4, తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే మూడు 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలను ఆమోదించారు.
- రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలవడానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
- మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలవడానికి ఆమోదం లభించింది.
- అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపింది.
- మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన అమోదం తెలిపింది.
- అమరావతి లో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి లభించింది.
- ప్రకాశం బ్యారేజి ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకోవడానికి సీఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చింది.
- వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అథారిటీ అంచనా వేసింది.
- భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
- సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది.
- రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.
- పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాలను నెలకొల్పడానికి అవసరమైన స్థలం కేటాయించడానికీ అథారిటీ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications