తిరుమలలో టీమిండియా స్టార్ ప్లేయర్లు: శ్రీవారి సేవలో..!!
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 59,335 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 23,271 మంది తలనీలాలను సమర్పించారు. 23 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది.
హుండీ ద్వారా 3.29 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. కార్తీకమాసారంభం అనంతరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లుచేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.

టీమిండియా స్టార్ క్రికెటర్లు ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాన్ని బహూకరించారు.
ఆలయం వెలుపలికి వచ్చిన రిషభ్ పంత్, అక్షర్ పటేల్‌తో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చలేదు క్రికెటర్లు. వారితో ఫొటోలు దిగారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Cricketers Rishabh Pant and Axar Patel visit Lord Balaji Temple. pic.twitter.com/aZVv8SX9gL
— ANI (@ANI) November 3, 2023
ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ 2023 ఆడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లోనూ ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది.
రిషభ్ పంత్ గానీ, అక్షర్ పటేల్ గానీ.. ఈ జట్టులో లేరు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రిషభ్ పంత్. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వంద శాతం ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అప్పట్లో అతన్ని జట్టులోకి తీసుకోలేదు టీమ్ మేనేజ్‌మెంట్. తొలుత అక్షర్ పటేల్ వరల్డ్ కప్ ఆడే టీమిండియాలో ఎంపిక అయినప్పటికీ.. ఆ తరువాత గాయపడ్డాడు. దీనితో వైదొలగాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications