AP Election: ఏపీ ఫలితాలపై సెఫాలజిస్ట్ సంజయ్ జోస్యం-విభేదించిన సీఎస్డీఎస్..!
దేశంలో జరిగే ఎన్నికలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అధ్యయనం చేసి, ఫలితాలను వెలువరించే సెంటర్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషిస్తోంది. త్వరలో ఎగ్జిట్ పోల్స్ వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలోని ఇదే సంస్థకు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన అంచనాలను చెప్పేశారు.
ఏపీలో ఈసారి వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగినా ఇందులో టీడీపీకే ఆధిక్యం వస్తోందని ఆయన అంచనా వేశారు. ఢిల్లీలో ఓ చర్చా గోష్టిలో పాల్గొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండటంతో సంజయ్ కుమార్ కూడా దీనిపై గణాంకాలేవీ బయటపెట్టలేదు. దీంతో ఆయన చెప్పింది నిజమా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్ దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించామని, ఆ రిపోర్ట్ రావడానికి మరో నాలుగు ఐదు రోజులు పడుతుందన్నారు.ఈలోపే తమ ఢిల్లీ సెఫాలజిస్ట్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిరాధారమని ఆయన తేల్చిచెప్పేశారు. తాము ఎన్నికలు జరిగిన తర్వాత ఏపీలో పరిస్థితులు పథకాలు అక్కడి వ్యక్తుల పనితీరు ప్రభుత్వాల పని తీరుపై సర్వే నిర్వహించామన్నారు. దీనిపై తాము శిక్షణ తీసుకుని మరీ అధ్యయనం చేస్తున్నామన్నారు. కాబట్టి ప్రొఫెసర్ సంజయ్ అభిప్రాయాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే రిపోర్ట్ రాగానే తామే వెల్లడిస్తామన్నారు.












Click it and Unblock the Notifications