cyclone fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం-ఏపీలో 4 జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్ అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తుపానుగా రూపాంతరం చెందుతోంది. దీనికి ఫెంగల్ గా ఇప్పటికే నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉన్న ఈ వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తుపానుగా మారబోతోంది. అనంతరం దీని ప్రభావం ఏపీతో పాటు తమిళనాడుపై ఉండొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని నాలుగు జిల్లాలకు భారీ వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవాళ అర్థరాత్రికి వాయుగుండం కాస్తా ఫెంగల్ తుపానుగా మారబోతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పుదుచ్చేరి వద్ద రేపు తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు ఏపీపైనా ప్రభావం ఉండబోతోంది. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోకి వచ్చే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ మేరకు అధికారులు ఫ్లాష్ ఫ్లడ్స్ రెడ్ అలర్ట్ జారీ చేశారు.

రేపు మధ్యాహ్నానానికి ఫెంగల్ తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయ్యాక రెండు రోజుల పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరిస్ధితిని బట్టి స్కూళ్లకు సెలవుల ప్రకటనతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల తరలింపు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో తుపాను ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications