గులాబ్ తుఫాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తక్షణ సాయం : సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం గులాబ్ తుఫాను ప్రభావంతో వణికిపోతోంది. గులాబ్ తుఫాను ప్రభావం, అనంతర పరిస్థితులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తుఫాన్ అనంతర పరిస్థితులను, అందిస్తున్న తక్షణ సహాయక చర్యలను అధికారులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు.

గులాబ్ తుఫాను కారణంగా మరణించిన వారికి రూ. 5 లక్షల తక్షణ సాయం
గులాబ్ తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా ఐదు లక్షల రూపాయలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని, అక్కడ వారికి రక్షిత మంచి నీరు, ఆహారం, వైద్య సదుపాయం కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వసతులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో పరిస్థితి జగన్ కు తెలిపిన సీఎస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన
ఇప్పటికే శ్రీకాకుళంలో తుఫాను ప్రభావాన్ని, సహాయక చర్యలను అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ రోజు సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆయన జిల్లా పరిస్థితిని తీసుకువెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాల్లో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని 38 పునరావాస కేంద్రాలలో 1514 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఇళ్ళలోకి నీరు చేరిన బాధితులకు వెయ్యి రూపాయల సాయం చెయ్యాలన్న సీఎం జగన్
ఇక విశాఖ నగరంలోని ముంపు ప్రాంతాలలో వర్షపునీటిని పంపింగ్ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని, ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, సహాయక శిబిరాల్లో నుంచి బాధితులు వెళ్ళేటప్పుడు కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి నష్టం అంచనాలను వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకోవాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు .

వర్షాలు తగ్గగానే విద్యుత్ పునరుద్ధరించాలన్న జగన్
ఇదే సమయంలో ఒడిశాలో కూడా బాగా వర్షాలు పడుతున్న కారణంగా వంశధార, నాగావళి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నిన్నటి నుండి అంధకారంలో ఉంది. వర్ష ప్రభావం తగ్గిన తర్వాత విద్యుత్ ను పునరుద్ధరించి ప్రతి అర గంటకు విద్యుత్ పరిస్థితులపై సమాచారం తెప్పించుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటికి గులాబ్ తుఫాను కారణంగా పడవ బోల్తా పడటంతో ఇద్దరు మత్స్య కారులు గల్లంతయ్యారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుండి మంత్రి అవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం నుండి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ లతో పాటుగా సీయస్ ఆదిత్యనాథ్, విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications