బెజవాడలో కొండలు దిగని జనం..! పోలీసులకు టెన్షన్..!
ఏపీలో మొంథా తుపాను నిన్న రాత్రే తీరం దాటినా ఇంకా దాని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. విజయవాడ నగరంలో నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మధ్యలో కాస్త తెరిపినిస్తున్నా తిరిగి మొదలవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదే సమయంలో నగరంలో విస్తరించి ఉన్న కొండలపై ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
విజయవాడ నగరంలో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జనం మాత్రం అక్కడి నుంచి కదిలేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా కొండ ప్రాంతాలకు వెళ్లి మైకుల్లో ప్రచారం చేస్తున్నారు.తుపాను నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని వారిని కోరుతున్నారు..

ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేశామని, కాబట్టి పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని, కొండలపై ఉండిపోతే కొండచరియలు విరిగి పడితే ప్రాణాలకు ప్రమాదం అని పోలీసులు వారికి సూచిస్తున్నారు. అయినా వారు కొండల్ని విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇవాళ కూడా ఎన్టీఆర్ కమిషనరేట్ లో అడ్మిన్ డీసీపీ సరిత ఇలా కొండ ప్రాంతాలకు వెళ్లి జనాన్ని బతిమాలుతున్న దృశ్యాలు కనిపించాయి.

మోంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం డీసీపీ సరిత స్వయంగా కొండ ప్రాంతాలను సందర్శించారు.
కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తుఫాన్ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications