ఏపీకి మరో శుభవార్త
వాతావరణశాఖ ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందించింది. నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది.అనంతరం మూడు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని, తర్వాత ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఈ ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా భావించే తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంపైకి బలంగా వీస్తున్నాయని వెల్లడించింది.

ఈశాన్య రుతుపవనాలు ముందుగా తమిళనాడులోకి ప్రవేశించి తర్వాత దక్షిణ కోస్తా పై ప్రభావం చూపుతాయి. దీంతో వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే అక్కడి వాతావరణ పరిస్థితిని అంచనా వేయగా ప్రారంభ దశ చాలా బలహీనంగా ఉందని భావిస్తున్నారు. దీని ప్రభావంవల్ల ఇవి ప్రవేశించే సమయంలోనే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ APSDMA తెలిపింది.












Click it and Unblock the Notifications