బుద్ధిలేనివాళ్లే, కెసిఆర్ ఇష్టం: డిఎస్, ఇంటి వాస్తుమార్పు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెసు పార్టీ పాత్ర ఏమీ లేదన్న వాళ్లు బుద్ధిలేనివాళ్లేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ ఆదివారం అన్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో కలిపేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో చాలాసార్లు చెప్పారని, ఇప్పుడు ఏమంటారనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆవిర్భావానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్ప ఎవరు కారకులు కాదన్నారు. కాంగ్రెసు పాత్ర లేదంటే బుద్ధిలేనితనమే అన్నారు. విలీనం కెసిఆర్ ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 15 లోకసభ, వంద అసెంబ్లీ స్థానాలలో గెలుస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్కటే పోరాడలేదని, విలీనంపై ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. అందరి పోరాటం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు.

కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే తాము అసెంబ్లీలో తెలంగాణ అంశం లేవనెత్తామన్నారు. ఉద్యమంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి పాత్ర మరువలేదనిదన్నారు. సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ ఏం చేశారో అందరికీ తెలుసునని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా ఎంత కష్టపడ్డారో ప్రపంచానికి తెలుసునని చెప్పారు.
డిఎస్ ఇంటికి వాస్తు మార్పులు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని డిఎస్ ఇంటికి వాస్తుమార్పులు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయించారు. ఇంటి వెనుక భాగంలో బరువుగా ఉండే నిర్మాణం, గేట్ మూయించడం వంటివి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో వాస్తు మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications