అరెస్టులు: 'ఆ ఇద్దరి'పై వైసిపి ఎమ్మెల్యే సవాల్, జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్య
విజయవాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మంగళవారం నాడు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమందిని రాజమండ్రి కోర్టుకు తరలించారు. ఈ అరెస్టులపై వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు.
తుని ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారని, ఆ ఇద్దరు తుని ఘటన జరిగిన ప్రాంతంలో లేరని దాడిశెట్టి రాజా చెప్పారు. వారిద్దరు అక్కడ ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ చేశారు.
తుని ఘటనను రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసుకు సంబంధించి చేసినవి అక్రమ అరెస్టులే అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ఘటనాస్థలికి కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది జనవరి 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని వి కొత్తూరు వద్ద కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

ముద్రగడకు గంటా ప్రశ్నలు
ముద్రగడ పద్మనాభం వైఖరిపై మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు ఘాటుగా స్పందించారు. తుని ఘటనకు కారకులైన సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోకూడదా? రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.
సంఘ విద్రోహ శక్తులకు మద్దతునిచ్చే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కాపు యువకులను అమలాపురంలో అరెస్టు చేశారన్న సమాచారంతో సోమవారం ఉదయం ముద్రగడ కిర్లంపూడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడం, ఈ సమాచారం తెలుసుకున్న కాపులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి రావడం జరిగిన విషయం తెలిసిందే.
చంద్రబాబును విమర్శించినప్పుడల్లా ఒక వికెట్ డౌన్: జలీల్ ఖాన్
ముఖ్యమంత్రి చంద్రబాబును వైసిపి అధినేత జగన్ విమర్శించినప్పుడల్లా ఒక వికెట్ పడుతోందని వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సోమవారం అన్నారు. చీటికి మాటికి చంద్రబాబును విమర్శిస్తే తగు పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
రెండు రోజుల్లో మరో ఎమ్మెల్యే టిడిపిలో చేరుతారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో విజయమ్మను ఏకవంచనంతో బొత్స సత్యనారాయణ సంబోధించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. టిడిపిపై చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. వాళ్లే వైసిపికి బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications