నిడదవోలులో ఆ 3 ఎక్స్ ప్రెస్ లకు హాల్ట్ ? పురందేశ్వరి లేఖ..!
ఏపీలోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నిడదవోలు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రూట్ లో ప్రయాణించే మూడు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాప్ లు ఇవ్వాలంటూ రైల్వే మంత్రికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari) కోరారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ లో దాదాపు 10 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసిన వేళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముందు ఆమె ఈ కీలక విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
నిడదవోలు రైల్వే స్టేషన్ విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-నర్సాపురం ప్రధాన మార్గాలను అనుసంధానించే కీలక కేంద్రమని, పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, జన్మభూమి ఎక్స్ ప్రెస్, కోకనాడ ఎక్స్ ప్రెస్ రైళ్లకు నిడదవోలు వద్ద హాల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరినట్లు పురందేశ్వరి వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో ఓ ట్వీట్ చేసారు.

🚆నిడదవోలు రైల్వే స్టేషన్లో 3 ముఖ్య ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల కోసం విజ్ఞప్తి
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 2, 2026
నిడదవోలు రైల్వే స్టేషన్ విజయవాడ–విశాఖపట్నం మరియు విజయవాడ–నర్సాపురం ప్రధాన మార్గాలను అనుసంధానించే కీలక కేంద్రం. పెరుగుతున్న జనాభా మరియు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రింది రైళ్లకు నిడదవోలు… pic.twitter.com/CjtYhHAeYM
ముంబైకు వెళ్లే చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, రైతు కుటుంబాలు, ఉద్యోగులు, ద్వారకా తిరుమల, విజయవాడ, మంగళగిరి యాత్రికులు నిడదవోలు రైల్వే స్టేషన్ లో ఈ రైళ్ల నిలుపుదల లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. సాధ్యతా నివేదిక ప్రకారం కేవలం 4-5 నిమిషాల అదనపు సమయం మాత్రమే ఈ స్టేషన్లో అవసరం అని ఆమె తెలిపారు. దీని వల్ల ఇతర రైళ్లపై ఎలాంటి ప్రభావం కూడా పడదని ఆమె తెలిపారు. అలాగే రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం నిడదవోలు వద్ద ఈ రైళ్లకు తక్షణం హాల్ట్ కల్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications