బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు-పురంధేశ్వరి కామెంట్స్..
ఏపీలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ కార్యాలయాల్లో పతాకావిష్కరణలు నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ ఛీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
ముందుగా ఏపీ బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేశారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారికి పురందేశ్వరి నివాళులు అర్పించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అన్నారు. ఆ విలువలను నిల బెట్టాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. భావి తరాల వారికి కూడా వారి త్యాగాలను తెలియ చేయాలన్నారు.

మన దేశంలో ఉన్న శాంతియుత వాతావరణం ఏ దేశంలో లేదని పురందేశ్వరి గుర్తుచేశారు. అనాదిగా వస్తున్న హైందవ విధానాలు ప్రధాన కారణమన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధి పదంలొ నడిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఉందని పురందేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ కేంద్రం సంక్షేమం, అభివృద్ధి చేసిందన్నారు.సౌభాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలని పురందేశ్వరి కోరారు. మోదీ హయాంలో భారతదేశం లో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు.

భావి తరాలను దృష్టి లో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా భారతదేశం మరింత ప్రగతి సాధిస్తుందని పురందేశ్వరి తెలిపారు. బీజేపీ తరపున అందరికి పురందేశ్వరి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ బీజేపీ ఛీఫ్ గా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన తొలి స్వాతంత్ర దినోత్సవం కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గతంతో పోలిస్తే పార్టీలో విభిన్న కార్యక్రమాలు చేపడుతున్న పురందేశ్వరి ఈసారి స్వాతంత్ర ప్రసంగంలోనూ రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications