రోజాకు చేదు అనుభవం: అడ్డుకున్న దళిత సంఘాలు
చిత్తూరు/రాజమండ్రి/ హైదరాబాద్ : సొంత నియోజకవర్గంలోనే వైయస్సార్ కాంగ్రెసు శానససభ్యురాలు, సినీ నటి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలోని నగరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను దళిత సంఘాల నేతల అడ్డుకున్నారు.
దళితులను అవమానించిన రోజా బాబా సాహెబ్‌కు పూలమాల వేయకూడదని నినదించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని కాసేపటికి విడుదల చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి రోజా పూలమాల వేసి వెళ్లిపోయారు. రోజా వెళ్లిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘం నేతలు క్షీరాభిషేకం చేశారు.

బిజెపి ధర్నా
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఓ లారీ డ్రైవరు నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులను బీజేపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసుల మామూళ్ల వ్యవహారంపై రాజమండ్రి టూటౌన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసేందుకు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు.
దీంతో పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన వివిధ పనులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటి జరిగింది. పుష్కరాలకు ప్రధాని సహా విదేశీ ప్రతినిధులు, పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
ఐదువేలమంది గజ ఈతగాళ్లు, వెయ్యి బోట్లు, భారీగా ఫైరింజన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి యనమల చెప్పారు.












Click it and Unblock the Notifications