నమ్మకస్తుడికి కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు..!!
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అయిదు గ్యారంటీలపై సంతకాలు చేశారు.
మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే సచివాలయంలో అడుగు పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు.

ఈ క్రమంలో నామినేటెడ్ పదవులపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనికోసం కసరత్తు మొదలుపెట్టారు. జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల కార్పొరేషన్లు.. ఇతర నామినేటెడ్ ఛైర్మన్ పదవుల్లో ఆ పార్టీలకు చెందిన నాయకులకూ పంపకాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆచితూచి వ్యవహరిస్తోన్నారాయన.
అదే సమయంలో కీలకమైన అడ్వొకేట్ జనరల్ పదవిని భర్తీ చేయనున్నారు చంద్రబాబు. సీనియర్ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను అడ్వొకేట్ జనరల్‌గా అపాయింట్ చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర దమ్మాలపాటి శ్రీనివాస్ బయోడేటాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌కు పంపించారు. దీన్ని ఆయన ఆమోదించాల్సి ఉంది.
అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించడం దమ్మాలపాటికి కొత్తేమీ కాదు. విభజన అనంతరం ఏర్పడిన ఏపీకి మొట్టమొదటి ఏజీ ఆయనే. 2014- 2019 మధ్యకాలంలో ఏర్పాటైన ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఆయనను ఈ పదవిలో అపాయింట్ చేసింది. అయిదు సంవత్సరాల పాటు ఏజీగా కొనసాగారాయన.
2019లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో- ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏజీగా పని చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల ఏజీ పదవి మళ్లీ దమ్మాలపాటిని వరించబోతోంది. ఆయన నియామకం లాంఛనప్రాయమే అవుతుంది.












Click it and Unblock the Notifications