జగన్, కిరణ్ సీమాంధ్రకే: దామోదర, కిరణ్ రెడ్డిపై జగ్గారెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రకే పరిమితం అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం అన్నారు. తెలంగాణ నోట్‌ను కేబినెట్ ఆమోదించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీలు విభజన విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రి డికె అరుణ కోరారు.
నీటి యుద్ధాలు జరగవు: పొన్నాల
రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు జరగవని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్యయ్య అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ పైన ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విభజనకు సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతికి అపఖ్యాతి వచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పిన వాళ్లు ఇప్పుడు నీటి యుద్ధాలు అనే కోణంలో మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

జగన్ కోరలేదా?: ఎర్రబెల్లి
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలోకోరలేదా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. అప్పుడు విభజన అన్న జగన్ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడమేమిటని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ అన్నారు.
సోనియా ఆదేశాలు కిరణ్ పాటిస్తారు: జగ్గా రెడ్డి
తమ పార్టీ అధ్యక్షురాలి ఆదేశాలను కిరణ్ కుమార్ రెడ్డి పాటిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. సమైక్యవాదం కిరణ్ వ్యక్తిగత అభిప్రాయమైనా అధినేత్రి ఆదేశాలు పాటిస్తారని చెప్పారు. విభజన నిర్ణయాన్ని పునపరిశీలించాలని కోరుతున్నట్లు చెప్పారు. కలిసుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందితుందన్నారు.












Click it and Unblock the Notifications