చర్చకు ఎంత టైమైనా పట్టొచ్చు: లగడపాటి, సూసైడ్లపైనా
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలని, ఆ చర్చకు ఎంతకాలమైనా పట్టవచ్చునని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. ఎపి జర్నలిస్టుల ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీలు హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బు నుండి వచ్చింది కాదని, తెలుగుతల్లి గర్భం నుండి వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమం కాదన్నారు. విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర కోసం రోడ్డెక్కుతున్నారని, అలాంటి ఉద్యమం పెట్టుబడిదారులది ఎలా అవుతుందని ప్రశ్నించారు. విభజనపై అసెంబ్లీ అభిప్రాయాన్నే మెజార్టీగా భావించాలని లగడపాటి అన్నారు.

ఈ నెల 2న విశాఖలో జరిగే సమైక్యాంధ్ర ఘోషలో పార్లమెంటు సభ్యులం అందరం పాల్గొంటామన్నారు. అఖిల పక్షంలో తమ పార్టీకి చెందిన గాదె వెంకట రెడ్డి, సిపిఎ తప్ప అందరూ విభజనకు అంగీకరించారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయవచ్చునని సూచించిందన్నారు.
విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగితే అది జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు నడుస్తుందా తెలియదన్నారు. చర్చ జరిగితే సమయం తీసుకుంటుందన్నారు. ఏకాభిప్రాయంతోనే విభజన జరగాలన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం పట్టించుకోలదని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు మెజార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటేస్తారని, రాష్ట్రపతి రాష్ట్రాన్ని రక్షిస్తారనే నమ్మకం తమకుందన్నారు.
ప్రేమ - ద్వేషం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో చేయి కలపడంపై లగడపాటి స్పందిస్తూ.. ద్వేషించడం, విమర్శలు చేయడం విభజనవాదుల లక్షణాలని, ప్రేమించడం, కలుపుకు పోవడం సమైక్యవాదుల లక్షణమన్నారు.
ఆత్మహత్యలకు కారణం వారే
తెలంగాణలో జరిగిన వెయ్యి బలిదానాలకు వేర్పాటువాదులే కారణమని లగడపాటి ఆరోపించారు. గతంలో హరీష్ రావు సిద్దిపేటలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదన్నారని, ఆ తర్వాత ఎల్బీ నగర్‌లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అందుకే తాను సమైక్యవాదులు ప్రేమతో ఉంటారని, వేర్పాటువాదులు రెచ్చగొడుతారని చెబుతున్నానన్నారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు వారే కారణమన్నారు.












Click it and Unblock the Notifications