ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై విచారణ: డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏమన్నారంటే!!
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో లీక్ కావడంతో ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లుగా అయింది.

ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో రచ్చ.. భగ్గుమన్న టీడీపీ
ఏపీ రాజకీయాలలో ఇప్పుడు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా టిడిపి నేతలు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకొని పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గోరంట్ల మాధవ్ మాత్రం తనను అప్రతిష్టపాలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వీడియోలో తాను ఉన్నట్లు మార్ఫింగ్ చేశారని ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్ట్ కు అయినా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఎవరైనా ఆ వీడియో ఒరిజినల్ వీడియో అని నిరూపించాలని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు.

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై వైసీపీ విచారణ జరుపుతోంది: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
ఇక ఇప్పటికే గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక తాజాగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్లు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

వీడియో వాస్తవమైతే కఠిన చర్యలు .. త్వరలోనే నిజానిజాలు బయటకు
వీడియో వాస్తవం అని తేలితే, పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది అంటూ తేల్చి చెప్పారు. ఇక ఈ వ్యవహారంలో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. ఇక మహిళల కోసం మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా చట్టాన్ని తీసుకు వచ్చారని, మహిళల విషయంలో ఎవరూ ఎటువంటి నేరాలకు పాల్పడిన సహించేది లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ మహిళల పక్షపాత పార్టీ అని, నిజంగా తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి సహించబోరని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు.












Click it and Unblock the Notifications