తిరుమల లడ్డూ కల్తీ పెరుమాళ్ళకే ఎరుక, జగన్ కూ భాగం ఉన్నట్టేగా: పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో ఈ వ్యవహారంపై లఘు చర్చను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఉపయోగించే సమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ నివేదికను సమర్పించిందని, తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నిజానిజాలు వెలుగులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే
తిరుమల వంటి పవిత్రక్షేత్ర ప్రతిష్టకు భంగం కలగకుండా పారదర్శకంగా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కఠినంగా స్పందించారు. ఈ కుంభకోణంలో ఎవరు దోషులైనా సరే తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.
ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలి
కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలి అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జంతు సంబంధ రసాయనాలున్నాయని ఎన్‌డీడీబీ నివేదించగా, అది నెయ్యే కాదని సీబీఐ తేల్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది ధర్మానికి సంబంధించిన విషయంగా, సకల మతాల గౌరవాన్ని ప్రభావితం చేసే అంశంగా ఉందని పవన్ కళ్యాణ్ శాసన సభా వేదికగా గుర్తుచేశారు.
జగన్ కూ భాగం ఉన్నట్టేగా: పవన్ కళ్యాణ్ ప్రశ్న
పాత తితిదే బోర్డును జగన్ సమర్థించడంపై, "ఆయనకూ భాగం ఉన్నట్టే కదా?" అని పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. 2020లో నెయ్యి సేకరణ నియమాలు మారాయని, ఈ వ్యవహారంపై కేసు నమోదైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications