భీమవరం డీఎస్సీకి రఘురామ క్లీన్ చిట్ ? పవన్ ఫిర్యాదు వేళ కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో నిన్న ఉన్నట్లుండి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ నివేదిక కోరడమే. కూటమి నేతల పేర్లు చెప్పుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని పవన్ కళ్యాణ్ కోరారు. దీనిపై ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,, పొరుగునే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అయిన రఘురామకృష్ణంరాజు స్పందించారు.
భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో ఆయన జోక్యం చేసుకొంటున్నారని, పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, కూటమి నేతల పేరు వాడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నట్లు జనసేన పార్టీ నిన్న ఓ ప్రకటన చేసింది. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీతో పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారని, తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారని తెలిపింది.

అలాగే అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్ సూచించారు. అలాగే పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ఎస్పీని ఆదేశించారు. దీంతో పాటు భీమవరం డీఎస్పీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ గుప్తాను కూడా కోరారు.

ఈ నేపథ్యంలో రఘురామ ఇవాళ భీమవరం డీఎస్పీపై స్పందించారు. తన కున్న సమాచారం ప్రకారం డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. జిల్లాలో పేకాటపై ఆయన గట్టి నిఘా పెట్టారని, అందుకే అభియోగాలు వస్తున్నాయని అనుకుంటున్నట్లు తెలిపారు. ఉండిలో ఎలాంటి పేకాట స్థావరాలు లేవని, జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. తద్వారా భీమవరం డీఎస్పీకి రఘురామ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications