
పోలవరంపై కేంద్రం జగన్ బతుకుని బట్టలిప్పి చూపించిందన్న దేవినేని ఉమా; సిగ్గు పడాలన్నసోమిరెడ్డి
గోదావరి నదికి వరదలు ముంచెత్తడంతో మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరమీదికి వచ్చింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం ముంపుకు గురైందని, ముంపు మండలాలను తిరిగి ఇచ్చేయాలని, పోలవరం ఎత్తును తగ్గించాలని చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రగడ మొదలైంది.

పోలవరం విషయంలో కొనసాగుతున్న రగడ.. మండిపడిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, రాజకీయ నేతలు పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ తీరును తాజా వ్యాఖ్యల నేపధ్యంలో ఎండగడుతున్నారు. ఇక పోలవరం విషయంలకో తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా టిడిపి నేత, మాజీ మంత్రులు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టును ఒక అసమర్ధుడి చేతిలో పెట్టాము అంటూ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ తో పోలవరం ఎత్తు తగ్గించే ఒప్పందం; అందుకే పోలవరం ఇలా: దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1,2 అడుగులకు తగ్గించడానికి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్నారని, ఈ మేరకే కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో కూడా మాట్లాడారని విమర్శలు గుప్పించారు. పోలవరం ఎత్తు గురించి కెసిఆర్ మాట్లాడి 37 నెలలు అవుతున్న జగన్ గాని ఆయన మంత్రులు గానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్ డబ్బులు తెచ్చుకున్నాడు కాబట్టే పోలవరంను, అమరావతిని పండబెట్టారని దేవినేని ఉమా మండిపడ్డారు.

ఇప్పటికైనా పోలవరం పై జగన్ శ్వేత పత్రం విడుదల చెయ్యాలన్న దేవినేని ఉమా
పోలవరం పట్ల వ్యూహాత్మక, చారిత్రాత్మక తప్పిదం చేశారని మండిపడిన దేవినేని ఉమ, కేంద్రం జగన్ బతుకుని బట్టలిప్పి చూపించిందని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా కేంద్రం వాస్తవాలు బయటపెట్టిన దేవినేని ఉమా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్రానికి తానే సీఎం అని భావిస్తే పోలవరం విషయంలో నోరు విప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

పోలవరం పై తెలంగాణా మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
ఇక పోలవరం మీద తెలంగాణతోపాటు, ఢిల్లీ పెద్దలు దిగివచ్చినా ఎవరు ఎలాంటి అభ్యంతరం పెట్టడానికి కుదరదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక ముంపు గ్రామాలను వెనక్కు తీసుకోవడం అనేది కూడా ఉండదని పేర్కొన్నారు. సోమిరెడ్డి దీనిపై ఎప్పుడో చట్టం చేశారని పేర్కొన్నారు.

తెలంగాణా, ఏపీ మధ్య ఆర్ధిక వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు
రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఆర్థిక వివాదాలు పరిష్కారం కాలేదని, ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవి చాలా ఇవ్వకుండా తెలంగాణా ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు.

పార్లమెంట్ లో కేంద్రం ప్రకటనతో జగన్ సర్కార్ సిగ్గు పడాలి
గత మూడేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. ఇక ఈ విషయాన్ని పార్లమెంటులో మంత్రి స్వయంగా ప్రకటించారని సోమిరెడ్డి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అని సోమిరెడ్డి మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు బాగా తగ్గిపోయాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రేపు మనుబోలులో భారీ ఎత్తున రైతు పోరు సభను నిర్వహించనున్నట్లుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.