జగన్ పెద్ద సూదిగాడు, ఎక్కడ గుచ్చుతాడో: దేవినేని ఉమా
రాజమండ్రి: రాష్ట్రంలో సూదిగాళ్లతో ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఓ పెద్ద సూదిగాడిగా తయారయ్యాడని, ఎక్కడ ఎప్పుడు గుచ్చుతాడోనని అతని మానసిక పరిస్థితి అర్థం కావడంలేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి లారీ ప్రమాదఘటనలో చేయివిరిగి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కురందాసు రాజును సోమవారం సాయంత్రం మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, రూ. 25 వేలు నష్టపరిహారం ఇస్తారని క్షతగాత్రుడిని ఓదార్చారు. క్షతగాత్రుడు పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన చికిత్స అందజేయమని మంత్రి వైద్యులను ఆదేశించారు.

ఆ తర్వాత మంత్రి ఉమ మాట్లాడారు. చాలాదురదృష్టకరమైన సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులతోపాటు స్థానిక ప్రతినిధులు వెంటనే స్పందించారని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం వేగంగా స్పందిస్తే అది ప్రతిపక్షనేత జగన్‌కు కనబడటంలేదని, మాట్లాడితే కుర్చీ దిగమంటున్నాడని విమర్శించారు.
పోలవ రం, పట్టిసీమ, ఇసుక, మట్టి అని ప్రతిదాన్నీ రాజకీయం చేస్తున్నారని, ఆఖరికి శవాలను కూడా వదల్లేదని, ఇది మంచి పరిస్థితి కాదని అన్నారు. శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అందరం బాధపడుతుంటే జగన్ ఓదార్పు మాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications