చంద్రబాబు ఎత్తుగడలు - మళ్లీ మోసం జరగనీయం : మంత్రి ధర్మాన..!!
అమరావతి అనేది రాష్ట్రమంతా సంబంధించిన సమస్యగా చిత్రించాలని చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు రాజధానిలో కూలీలుగా ఉండాలా అని మంత్రి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పనిచేస్తామంటే తప్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మిగతా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని మీద ప్రభుత్వం వచ్చిన తరువాత సుదీర్ఘమైన చర్చ అసెంబ్లీలో జరిగిందని గుర్తు చేసారు. ఆ సభలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రిగా అనేక అనుభవాలు, వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు.

అమరావతిని రాజధానిగా చేయడం వెనుక ఉన్న దురుద్దేశపూరితమైన అక్రమ సంపాదన కోసం చేస్తున్న పనిని, అసత్యాలను శాసనసభలో వివరించినట్లు గుర్తు చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉండేది. హైదరాబాద్‌ను విడిచి రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఏకకంఠంతో ఏపీ అంతా వీల్లేదని, హైదరాబాద్‌ను వదులుకోమని ఎందుకు చెప్పిందో ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి లభించిన రెవెన్యూను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేట్టుగా పెట్టుబడి పెట్టి ఉంటే.. అనేక రాష్ట్రాలు చేసినట్టుగా మనం చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం రాష్ట్రానికి జరిగి ఉండేది కాదన్నారు. ఇప్పుడు అమరావతిలో 33 వేల ఎకరాలు, నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి.. మరో 60-70 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. తెలంగాణలో జరిగిన పని మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా అని ధర్మాన ప్రశ్నించారు, మా ప్రాంతాన్ని విడిచివెళ్లండి అని ఉత్తరాంధ్ర, రాయలసీమ వారిని అంటే.. ఇప్పుడు నష్టపోయిన 65 సంవత్సరాలు కాకుండా.. మరో 60 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకోసమే ఈ మోడల్‌ను ప్రపంచంలో ఎక్కడా అంగీకరించడం లేదని చెప్పారు. ఒకేచోట పెట్టుబడంతా పెట్టి.. అభివృద్ధి చేసే మోడల్ అంగీకారం కాదని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications