ఏపీలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు ? చంద్రబాబు అమరావతిపై ధర్మాన ఫైర్..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యమని, కానీ తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao)ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వారని, అందరినీ సమానంగా చూడాలని కోరారు. కానీ సీఎం కేవలం ఒక ప్రాంతానికే, కొద్దిమంది సంపన్నులకే కొమ్ముకాస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
హైదరాబాద్‌పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగిందని, మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్రా, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నియమించిన నిపుణుల కమిటీని చంద్రబాబు గౌరవించలేదన్నారు. అమరావతి రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారని విమర్శించారు.

అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదని, రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారని ధర్మాన గుర్తుచేశారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదన్నారు. ఉత్తరాంధ్రా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే స్పష్టంగా చెప్పిందన్నారు. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్రా ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదన్నారు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు.
విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా? అని అడిగారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కూడా ఇవ్వరా అన్నారు. లక్ష ఎకరాల్లో అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు కావాలని, అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతకాలం ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? అని ప్రశ్నించారు. ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయన్నారు. భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర సంపద ఐదు కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదన్నారు. విశాఖ, విజయనగరంలో వస్తున్న సంస్థల ఆస్తులు ఇతర ప్రాంతాల వ్యక్తులకే చెందుతున్నాయన్నారు.

అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు గోచీ తప్ప ఏమీ మిగలదన్నారు. ముఖ్యమంత్రి పంతం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయమన్నారు. వలసలు ఆగేలా, స్థానిక ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు ఎందుకు కేటాయించడం లేదన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కాకుండా సమాన అభివృద్ధికి సీఎం బాటలు వేయాలని కోరారు. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చంద్రబాబు తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications