తుని ఘటనలో తొలి అరెస్ట్: పోలీసుల అదుపులో రౌడీషీటర్ దూడల ఫణి
అమరావతి: కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో చేపట్టిన కాపు ఉద్యమం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి సీఐడీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
తుని ఘటనలో అనుమానితులుగా పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా 10 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీసీ టీవీ దృశ్యాలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో నిందితులను గుర్తించిన సీఐడీ రౌడీషీటర్ దూడల ఫణిని నేడు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కడప జిల్లా నుంచి 10 మందిని, గుంటూరు జిల్లా నుంచి 23 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనంలో దూడల ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, మిగతా నిందితులు ఎక్కడివారో ఫణిని విచారిస్తే తెలుస్తుందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవడంతోపాటు తుని ఘటన వెనుకున్న అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసులు తెలిపారు. త్వరలోనే మరికొంత మంది నిందుతులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలలో జరిగిన కాపునాడు సమావేశంలో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేందుకు ఆగస్టు నెలాఖరు వరకూ డెడ్‌లైన్ విధిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టులోగా కాపులను బీసీల్లో చేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
జూన్ 20 నాటికి జిల్లాల వారీగా కాపుల జనాభా లెక్కలు తేల్చాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వంలోని కొందరు పదవుల కోసమే కాపు ఉద్యమంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యమిస్తున్న తమను విమర్శించడం మానేసి కాపులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు.












Click it and Unblock the Notifications