ఒక్క దీపమైనా వెలిగిందా ? చంద్రబాబుకు జగన్ దీపావళి ట్వీట్..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి దీపావళి వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. తాజాగా లండన్ టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన జగన్.. వచ్చీ రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని దాదాపుగా అమలు చేసేశామని అధికార పార్టీ చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు.
మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000, 50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట అమలు చేశారా అని ప్రశ్నించారు.

అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000, ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలో...లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?అని వరుస ప్రశ్నలు సంధించారు.

.@ncbn గారూ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025
మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?
1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి
2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000
3.50 ఏళ్లకే పెన్షన్,…
వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా అని ప్రశ్నించారు. మా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య... ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని గుర్తుచేస్తూ జగన్ ముగించారు.












Click it and Unblock the Notifications