ఏపీలో రూ 919 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు..!! గృహ వినియోగదారులపై భారం : శ్లాబుల్లో మార్పులు..!!
ఏపీలో విద్యుత్ ఛార్జీల వడ్డనకు రంగం సిద్దం అవుతోంది. ప్రధానంగా గృహ వినియోగదారులపై భారీ వడ్డన దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. విద్యుత్ టారిఫ్ కేటగిరీల్లో మార్పుల ద్వారా గృహ వినియోగదారులపై భారం పడనుంది. దాదాపుగా రూ 919 కోట్ల భారం ఖాయమని తెలుస్తోంది. హేతుబద్దీకరణ పేరుతో కేటగిరీల్లో మార్పులకు ప్రతిపాదనలు అందించారు. వీటిని ఎపిఇఆర్‌సి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయాన్ని ఎపిఇఆర్‌సి ప్రకటించనుంది.

తాజా ప్రతిపాదనల్లో కీలక అంశాలు
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు రూ 6125 కోట్ల రూపాయల ట్రాఅప్ ఛార్జీలతో పాటు, శ్లాబుల మార్పుతో 920 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుంది. మొత్తంగా 7,085 కోట్ల రూపాయల భారం మోపాలని డిస్కాంలు ప్రతిపాదించాయి. శ్లాబులు మార్పు వల్ల ఎస్‌పిడిసిఎల్ పరిధిలో రూ.324.63కోట్లు, ఎపిఇపిడిసిఎల్ పరిధిలో రూ.341.99కోట్లు, రూ.252.56కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడనుంది. శ్లాబుల మార్పు భారం గ్రూప్-ఎలోని రెండు రకాల వినియోగదారులు, గ్రూప్-బిలోని 300యూనిట్ల విద్యుత్ వినియోగించే వినియోగదారులపై భారం ఎక్కువగా పడనుందని అంచనా వేస్తున్నారు.

ట్రూ అప్ భారం సైతం తప్పదా
శ్లాబుల మార్పుల భారంతో పాటు వినియోగదారులపై ట్రూఅప్ భారం కూడా పడనుంది. వెనక్కి తగ్గిందనుకున్న రూ.3670కోట్ల ట్రూఅప్ భారం పెండింగ్‌లో ఉన్నాయని, భారం మోపేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. అదేవిధంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2480కోట్ల ట్రూఅప్‌ను కూడా ప్రతిపాదించాయి. జిఓ 161 ప్రకారం రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందుతాయని డిస్కాంలు తెలిపాయి. అయితే ఆ జివోలో దాగున్న అంశాలను బయటపెట్టలేదు. సాధారణంగా కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి రావలసి ఉంది.

ఈఆర్సీ నిర్ణయం కీలకంగా
గృహ వినియోగ దార్ల చార్జీల పెంపు ఆగస్టు ఒకటి నుండి వర్తింపచేస్తామని డిస్కామ్‌లు ప్రతిపాదించడం విశేషం. ఇందుకు కారణాలను వివరించలేదు. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎపిఇఆర్‌సి విడుదల చేయనుంది. మొత్తంటా టారిఫ్ కేటగిరీల్లో మార్పులు చేయటం ద్వారా మధ్యతరగతి వారి మీదే ఎక్కువగా భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందునా 200 లోపు విద్యుత్ యూనిట్లను వినియోగించే వారికి కొత్త ప్రతిపాదనలు భారం అవుతాయని చెబుతున్నారు. దీనికి అధికారికంగా ప్రకటించిన తరవాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications