రాజధానుల పోరుతో ఏపీలో ప్రాంతీయ చీలిక ? మధ్యాంధ్ర వర్సెస్ ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ !
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అమరావతికి మద్దతుగా ఉన్న విపక్షాలకూ, మూడు రాజధానుల్ని ప్రోత్సహిస్తున్న వైసీపీకి మధ్య రాజకీయంగా పోరు ముదురుతోంది. ఫైనల్ గా ఇది మూడు ప్రాంతాల మధ్య స్పష్టమైన చీలికకు కారణమవుతోంది. ముఖ్యంగా అమరావతికి మద్దతిస్తున్న మధ్యాంధ్రకూ, మూడు రాజధానులకు మద్దతిస్తున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మధ్య ఇది చీలికకు కారణమవుతోంది.

ఏపీలో రాజధానుల పోరు
ఏపీలో రాజధానుల పోరు ముదురుతోంది. అమరావతి రాజధాని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్రకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ఇప్పటివరకూ అండగా నిలిచాయి. దీంతో యాత్ర సాఫీగానే సాగిపోయింది. చివరిగా ఈ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాను దాటి తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తున్న క్రమంలో తణుకు నియోజకవర్గంలోనూ వైసీపీ శ్రేణులు స్ధానికులతో కలిసి నిరసనలు తెలిపినా అంతిమంగా యాత్ర మాత్రం ఆగలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపూ మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ అండతో ఈ నెల15న విశాఖలో జరగబోతున్న వికేంద్రీకరణ గర్జనపైనే నెలకొంటోంది.

అమరావతికి మధ్యాంధ్ర మద్దతు
అమరావతి రాజధానికి మధ్యాంధ్ర అంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇప్పటివరకూ మంచి స్పందన కనిపించింది. ఇప్పుడు యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ కూడా యాత్రకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో మధ్యాంధ్రలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు అమరావతి యాత్రకు దాదాపుగా మద్దతిచ్చినట్లే అవుతోంది. వీటి తర్వాత ఉత్తరాంధ్రలోకి ఎంటరైన తర్వాత పరిస్దితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్ధితి. అమరావతి రాజధానికి ఈ నాలుగు జిల్లాలతో పాటు గతంలో రైతులు తిరుమలకు చేసిన యాత్రలో మద్దతిచ్చిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ దాదాపుగా మద్దతు లభించినట్లే చెప్పుకోవచ్చు.

మూడు రాజధానులకు ఉత్తరాంధ్ర, సీమ మద్దతు
మూడు రాజధానులకు మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని రూపంలో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పక్కనే ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూరనుండగా.. కర్నూల్లో న్యాయరాజధాని రూపంలో రాయలసీమ జిల్లాలకు ప్రయోజనం చేకూరబోతోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతు లభిస్తోంది. అది పూర్తిగానా లేక పాక్షికంగానా అన్నది ఎన్నికల్లో తేలాల్సి ఉంది.

మధ్యాంధ్ర వర్సెస్ ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ ?
రాజధానుల పోరు నేపథ్యంలో అమరావతికి అండగా నిలుస్తున్న మధ్యాంధ్ర ప్రాంతానికీ, మూడు రాజధానులకు అనుకూలంగా కనిపిస్తున్న ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ ప్రాంతాలకూ మధ్య గ్యాప్ పెరుగుతోంది. అమరావతికి అండగా నిలుస్తున్న మధ్యాంధ్ర జిల్లాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న వైసీపీ వైఖరిపై ప్రతికూలత పెరుగుతుండగా.. ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ ప్రాంతాల్లో అమరావతి రాజధానిపై వ్యతిరేకత కనిపిస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న ప్రకటనలు, క్షేత్రస్ధాయిలో నెలకొన్న పరిస్దితులే ఇందుకు కారణం. అయితే ఈ ప్రతికూలత లేదా అనుకూలతలు ఏ స్ధాయిలో ఉన్నాయన్నది నిర్దిష్టంగా తేలకపోయినా జనంలో పెరుగుతున్న చీలిక మాత్రం సమైక్యాంధ్ర భావనను బీటలు వార్చేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications