సీమాంధ్ర వైద్యులు గోబ్యాక్: గాంధీలో విభజన చిచ్చు
హైదరాబాద్: రాష్ట్ర విభజన చిచ్చు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిని తాకింది. గాంధీలో పనిచేస్తున్న సీమాంధ్ర వైద్యులు వెనక్కి వెళ్లాలని, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న సీమాంధ్ర వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ తెలంగాణ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ‘సీమాంధ్ర వైద్యులు గో బ్యాక్ - హెచ్చరిక' అంటూ సోమవారం ఆస్పత్రి ఆవరణలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి.
సంఘం కార్యదర్శి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం పలువురు వైద్యులు ఆస్పత్రి ఆవరణలో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ కమిటీ సీమాంధ్ర వైద్యులకు అనుకూలంగా ఉందని రమేష్ విమర్శించారు.

తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీమాంధ్ర వైద్యులు వెంటనే వెనక్కి వెళ్లాలని కోరుతూ అనేక సార్లు డీఎంఈ అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్ కుమార్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. సీమాంధ్రకు చెందిన అనస్తీషియన్ భూపేష్ తనతో అసభ్యంగా మాట్లాడారంటూ డాక్టర్ రమేష్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
అలాగే డాక్టర్ భాస్కర్‌రాజు ఏడాది నుంచి గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించడంలేదని, హాజరు బుక్‌లో ఫోర్జరీ సంతకాలు పెట్టిన ఆ వైద్యుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ రమేష్ సూపరింటెండెంట్‌ను కోరారు. అనంతరం తెలంగాణ వైద్యులకు అన్యాయం జరుగుతోందంటూ ఆయనకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆర్‌ఎంఓ 2 ప్రమీల, భూమేష్ కుమార్, కృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications