కెసిఆర్‌కు వాస్తుపోటా, వెన్నుపోటా?: డికె అరుణ, కెసిఆర్ రిప్ల్లై
హైదరబాద్: సచివాలయాన్ని వాస్తుపోటుకు భయపడి మార్చాలనుకుంటున్నారా? లేక వెన్నుపోటుకు భయపడి మార్చాలనుకుంటున్నారా? అని కాంగ్రెసు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి డికె అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు. ఇప్పుడున్న సచివాలయం వల్లే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆమె గుర్తు చేశారు.
వాస్తు, జాతకాలు వ్యక్తిగతానికి సంబంధించినవి మాత్రమేనని వాటిని ప్రభుత్వంపై రుద్దకూడదని ఆమె సూచించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి శాసనసభకు దగ్గర్లో ఉందని, ప్రజలకు అందుబాటులో, ట్రాఫిక్ లేని ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మేలు కొరుకునేవారే అయితే వాస్తు పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడం కన్నా ఎర్రగడ్డ, ఈఎస్‌ఐని కలిపి నిమ్స్‌కు అనుబంధంగా హెల్త్ యూనివర్సిటీని నిర్మిస్తే కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

రుణమాఫీ అందకపోవడంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శిస్తూ రైతుల ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా? ఆమె ప్రశ్నించారు. రైతుల సమస్యలు తెలియని కేసీఆర్ సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడని అరుణ అన్నారు. ఒకే రోజు సమగ్రసర్వే చేయించిన కేసీఆర్ వార్డుల విభజన చేయించలేరా? జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేస్తున్నారని అరుణ ప్రశ్నించారు. దమ్ముంటే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలని, తమ పార్టీకే మెజారిటీ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మల్యే డీ.కే.అరుణ విమర్శలను తిప్పి కొట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అరుణపై వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆరోపణలు వింటుంటే నవ్వాలో, ఏడవాలో అర్ధం కావట్లేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు చీకటి కనిపిస్తోందని అందుకే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇదే విమర్శలతో ఆ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళతాయా అని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు కెసిఆర్ ఆ ఎమ్మెల్యే ఎవరంటూ పక్కనున్నవారిని అడిగారు.












Click it and Unblock the Notifications