పవన్ కళ్యాణ్ కు డీఎంకే సవాల్-చెన్నైలో గెలిచి చూపిస్తే..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తమిళనాడులో పర్యటించారు. మధురైలో మురుగన్ భక్తుల సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పనిలో పనిగా అక్కడి అధికార డీఎంకేపై విమర్శలు ఎక్కుపెట్టారు. మురుగన్ భక్తుల సదస్సుకు సంబంధం లేకపోయినా డీఎంకేను అందులోకి లాగి విమర్శలకు దిగారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్ధాలిన్ గతంలో చేసిన విమర్శల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పవన్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చని, ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చని, కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరమంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడంటూ పవన్ వ్యాఖ్యానించారు. తద్వారా సనాతన ధర్మాన్ని ప్రశ్నించే డీఎంకే నేతలకు పవన్ తనదైన శైలిలో చురకలు అంటించినట్లయింది. దీనిపై డీఎంకే స్పందించింది.

పవన్ కళ్యాణ్ మధురైలో డీఎంకేపై చేసిన విమర్శలపై ఆ పార్టీకి చెందిన మంత్రి శేఖర్ బాబు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు అసలు తమిళనాడుతో ఏం సంబంధం ఉందని అడిగారు. తమను ప్రశ్నించడానికి ఆయనెవరని నిలదీశారు. బీజేపీ మాయలో పడి మత రాజకీయాల్ని ప్రోత్సహించవద్దంటూ పవన్ కు ఆయన హితవు పలికారు. తమ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు వింటామని మంత్రి శేఖర్ బాబు తెలిపారు.













Click it and Unblock the Notifications