వీటిని తేల్చండి: భేటీలో టిపై సోనియాకి షాకిచ్చిన బొత్స!

తాను ప్రస్తావించిన ఏడు సమస్యలను పరిష్కరించకపోతే విభజన సమస్య జటిలమైపోతుందని హెచ్చరించటంతో సోనియా, రాహుల్ కలుగజేసుకుని ఎఐసిసి సమావేశానంతరం దీనిపై దృష్టి కేంద్రీకరిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోనే ఉండాలని వారు ఆయన్ని ఆదేశించారు. దీనితో బొత్స మరో మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండవలసి వస్తుంది. వర్కింగ్ కమిటీ సమావేశంలో చివర్లో రాష్ట్ర విభజన ఆంశాన్ని బొత్స ప్రస్తావించారు.
విభజన యోచన కారణంగా సీమాంధ్రకు ఎదురయ్యే ఏడు సమస్యలపై ఒక వినతి పత్రాన్ని బొత్స అందజేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన పట్ల సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని, రాష్ట్రాన్ని విభజిస్తే తమ ప్రాంతంలో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోతుందని ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారని వివరించారు. అన్ని అంశాల్లో తమకు న్యాయం జరగదని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాదు సాధించిన అభివృద్ధి స్థాయికి తమ ప్రాంతం చేరుకోవాలంటే కనీసం యాభై సంవత్సరాల సమయం పడుతుందన్నది సీమాంధ్ర ప్రజల భావన అని, మూడు ప్రాంతాలకు హైదరాబాదులోని పరిశ్రమలు, ఐటి రంగం నుండి వచ్చే అదాయంలో నుంచి భాగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ప్రస్తావించిన సమస్యలను తెలంగాణ విభజన బిల్లులో ప్రస్తావించకపోవటం శోచనీయమన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజించటం సాధ్యం కాదన్నారు. బొత్స ప్రసంగం ముగియగానే సోనియా, రాహుల్‌లు ఆయనను పిలిచి ఎఐసిసి సమావేశం ముగిసిన అనంతరం ఈ అంశాలపై చర్చిస్తామని సూచించారు.












Click it and Unblock the Notifications