మమ్మల్ని లాగొద్దు: అశోక్, 'గజల్‌ను అనుమతించారు'
హైదరాబాద్: తమను వివాదాల్లోకి లాగవద్దని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గురువారం చెప్పారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. తాము హైకోర్టు తీర్పు అనంతరం భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీని వేయాలన్నారు. రాజీనామాలు చేయని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై తాము ఒత్తిడి తెస్తామన్నారు.
అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే పార్టీలు విప్ జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. అవసరమైతే తాము తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులను కూడా కలుస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదిన సమ్మె ఉధృతిపై జెఏసి, ప్రజా సంఘాల జెఏసిలతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

సమైక్యాంధ్ర కోరుతున్న వారిపై పోలీసులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించాలని పిలుపునిచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కాంగ్రెసు ఎంపీలు సమైక్యం కోసం ఒత్తిడి తేవాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కూడా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెకు సహకరిస్తున్నారని కితాబిచ్చారు. ఉద్యోగుల సమ్మెతో కొన్ని కష్టాలు తప్పవని, సమైక్యాంధ్ర కోసం ఇలాంటివి తప్పవన్నారు. ఉద్యమం సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించమని చెప్పారు.
గజల్ శ్రీనివాస్‌కు అనుమతిచ్చారు: ఎర్రోళ్ల
ఎపిఎన్జీవో సభ సమయంలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ పైన దాడి చేసిన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని తెరాస సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ గురువారం హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. సభకు 19 నిబంధనలతో అనుమతించినట్లు చెప్పారని, అందుకు ముఖ్యమంత్రి, డిజిపి తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులపై దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సభకు రాజకీయ నాయకులకు అనుమతి లేకున్నప్పటికీ కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకున్న గజల్ శ్రీనివాస్‌ను అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications