ట్రంప్ దెబ్బకు ఏపీ రొయ్య విలవిల..! ఇప్పట్లో కష్టమేనా ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాల నిర్ణయం చాలా దేశాలపై ప్రభావం చూపుతోంది. ఇందులో భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడటంతో ఇక్కడ వాటి తయారీదారులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రైతుల పరిస్ధితి దారుణంగా మారిపోయింది. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికాకు ఎగుమతి చేయాల్సిన ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి.
అమెరికాకు భారత్ నుంచి భారీ ఎత్తున అక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తుల ధరలపై వీటి ప్రభావం పడింది. అంతంత సుంకాలతో ఆక్వా ఉత్పత్తులు అమ్మలేక వాటిని భారత్ లో దేశీయ మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన పరిస్ధితి రైతులకు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరంలో ఉన్న ప్రాంతాల్లో చేపలు, రొయ్యల ఎగుమతులపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోవడంతో దళారులకు ఎంతో కంత ధరకు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్ధితి రైతులకు ఎదురవుతోంది. దీంతో వారిని దళారులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. 80 కౌంట్ రొయ్యలు గతంలో నాలుగైదు వందలకు అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు వాటిని కేజీ 180-200కు అమ్మకోవాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే 60-70 కౌంట్ రొయ్యల్ని రూ.250 వరకూ అమ్ముకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అయితే కేంద్రం కూడా ఇప్పుడు అమెరికా పన్నుల విషయంలో ఏమీ చేయలేని పరస్దితుల్లో ఉండటంతో ఆక్వా రైతులకు మరికొంతకాలం ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications