ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన-మొత్తం ఓటర్లు 4 కోట్లు-పూర్తి వివరాలివే..
ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఎన్నికల సంఘం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ తర్వాత తాజాగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ విడుదల చేశారు. దీన్ని రాజకీయ పార్టీలతో పాటు అందరకీ అందుబాటులో ఉండేందుకు వెబ్ సైట్లో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవాళ విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా లో పలు కీలక వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4 కోట్ల 2 లక్షల 21 వేల 450గా తేల్చారు. ఇందులో పురుషులు కోటీ 98 లక్షల 31 వేల 791గా తేలింది. అలాగే మహిళలు 2 కోట్ల 3 లక్షల 85 వేల 851 ఉన్నారు. వీరితో పాటు ట్రాన్స్ జెండర్లు 3808 ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా అనంతపురం నిలిచింది. ఈ జిల్లాలో 19 లక్షల 79 వేల 775 మంది ఓటర్లున్నారు. అత్యల్ప ఓటర్లు కలిగిన జిల్లాగా 7 లక్షల 40 వేల 857 మందితో అల్లూరి సీతారామరాజు నిలిచింది.

ఎన్నికల సంఘం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కాగా.. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, ఫిర్యాదుల కోసం డిసెంబర్ 9 వరకూ సమయం ఇచ్చారు. ఇలా వచ్చిన అభ్యంతరాల్ని డిసెంబర్ 26 వరకూ పరిష్కరిస్తారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి 1న తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురించి విడుదల చేస్తారు.
ఏపీలో ఎన్నికల ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నకిలీ ఓట్లు భారీగా ఉన్నాయని, అసలు ఓట్లు తొలగించారనే ఫిర్యాదుల్ని వైసీపీ, టీడీపీ పరస్పరం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. దీంతో రేపటి నుంచి ఇరు పార్టీలు ఈ జాబితాను చూసకుని తిరిగి ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయి. వాటిపై డిసెంబర్ లోగా ఎన్నికల సంఘం పరిష్కరిస్తుందా లేక అలాగే తుది జాబితాల్ని ప్రచురిస్తుందా చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications