DSC 2025: కాల్ లెటర్స్, నియామకాల పై ప్రభుత్వ తాజా నిర్ణయం - కీలక సూచనలు..!!
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామక ప్రక్రియ పైన మరో కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురుచూశారు. ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినా రెండు జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. అదే విధంగా కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్ధులకు కీలక సూచనలు చేసారు.
డీఎస్సీలో మెరిట్ అభ్యర్ధులకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు. ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఈలోగా అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.

అదే విధంగా విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), అంగ వైకల్య ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), కాల్‌లెటర్‌లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పరిశీలనకు హాజరు కావాలన్నారు. కేటాయించిన తేదీ, సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని, మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారని వివరించారు. కాగా, సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు నిరీక్షించారు. అయితే... సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇక.. ఈ రోజు నుంచి ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications