నిమ్మగడ్డతో పోరు- జగన్ సర్కారుకు ఎగ్జిట్ ప్లాన్ కరవు- ఏకకాలంలో సహకారం, విమర్శల వెనుక ?
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఏడాది కాలంగా సాగిస్తున్న పోరు చివరి దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో దీన్నుంచి రాజకీయంగా నష్టం లేకుండా ఎలా బయటపడాలో తెలియక వైసీపీ సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సుప్రీంకోర్టు తీర్పుతో ఓవైపు అధికారుల ద్వారా నిమ్మగడ్డకు సహకారం అందిస్తున్నట్లు నటిస్తూ మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన నిబద్ధతపై తీవ్ర విమర్శలకు దిగుతోంది. తద్వారా తమకు ఎగ్జిట్ ప్లాన్ కరవైందనే అంశాన్ని సర్కారు బయటపెట్టుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సుప్రీంతీర్పుతో జగన్, నిమ్మగడ్డ వార్‌కు తెరపడలేదా ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఓసారి తీర్పు ప్రకటిస్తే అంతా సద్దుమణుగుతుందని భావించిన వారికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ తప్పదని, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సహకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి తగ్గింది. అప్పటివరకూ ఎస్‌ఈసీ ఆదేశాలను లెక్కచేయని అధికారులు ఇప్పుడు ఆయనతో సమావేశాలకు హాజరవుతున్నారు. ఆయన ఆదేశాలను కాస్తో కూస్తో పాటిస్తున్నారు. అయితే ఎస్‌ఈసీ అదేశాలను ఓవైపు పాటిస్తూనే మరోవైపు వాటికి వ్యతిరేక వ్యాఖ్యలతో వైసీపీ సర్కారు గందరగోళం సృష్టిస్తోంది.

అధికారులు అలా- మంత్రులు ఇలా...
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు సహకరించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇదే క్రమంలో అధికారులు కూడా ఎస్‌ఈసీ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఎస్‌ఈసీ కోరినట్లుగా బదిలీలు కూడా చేశారు. పంచాయతీ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా అధికారులు హాజరయ్యారు. మరోవైపు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కన్నబాబు, అనిల్ ఇలా ఒక్కొక్కరుగా ఎస్‌ఈసీపై విమర్శలకు దిగుతున్నారు. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఒకరంటే, ఆయన చంద్రబాబు బ్రోకర్ అని మరొకరు, బ్లాక్ మెయిలర్ అని ఇంకొకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వైసీపీ సర్కారు అయిష్టంగానే నిమ్మగడ్డకు సహకరించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఏకగ్రీవాల విషయంలోనూ కౌంటర్లు
రాష్ట్రంలో బలవంతపు ఏకగ్రీవాలపై నిశితంగా దృష్టిసారిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటించడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎస్‌ఈసీ ప్రకటన రాగానే ఏకగ్రీవాలకు అనుకూలంగా ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో విడుదల చేయడమే కాకుండా వార్తాపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చేసింది. ఇది మరో వివాదాన్ని రాజేసింది. అంతే కాదు నిమ్మగడ్డ ఏకగ్రీవాలను అడ్డుకుంటామని చెప్పడాన్ని కూడా మంత్రులు తప్పుబడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా ఎస్ఈసీపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

జగన్ సర్కారుకు ఎగ్జిట్ ప్లాన్ కరవైందా ?
గతంలో రాజ్యాలు, రాజుల మధ్య యుద్ధాలు జరిగేటప్పుడు తప్పనిసరి పరిస్ధితుల్లో విరమించాల్సి వస్తే ఓ ప్లాన్ ప్రకారం బయటపడేవారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించి అన్‌లాక్ పేరుతో ఎగ్జిట్ ప్లాన్ అమలు చేసింది. అలా కాకుండా ఒక్కసారిగా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే అందరికీ నష్టం తప్పదు. ఇప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌తో ఏడాదిగా సాగిస్తున్న యుద్ధానికి ఎగ్జిట్ ప్లాన్‌ను కనుగొనే విషయంలో జగన్ సర్కారు విఫలమైనట్లే కనిపిస్తోంది. దీంతో నిమ్మగడ్డతో పోరును ఎలా ముగించాలో తెలియక ఆయనతో కలిసి పనిచేస్తున్నట్లు నటిస్తూనే విమర్శలు కొనసాగిస్తోంది. ఒక్కసారిగా విమర్శలు ఆపేస్తే జనం దృష్టిలో నిమ్మగడ్డ చేతిలో తాము ఓడామన్న ప్రచారం జరుగుతుందన్న భయం మంత్రుల విమర్శల్లో కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.