రూ. 2.32 కోట్లు పలికిన దుర్గామాత చీరలు
విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను పోగు చేసుకోడానికి బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఇందులో 2 కోట్ల, 32 లక్షల, 30 వేల రూపాయలకు హెచ్చుపాట పాడుకున్న ఎం రవికుమార్ లీజు హక్కు పొందారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇవో త్రినాథరావు ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి భవానీదీక్ష మంటపంలో చీరలు పోగుచేసుకోడానికి బహిరంగ వేలంపాట నిర్వహించారు.
దేవస్థానం ఎఇవోలు వి రాంబాబు, బి వెంకటరెడ్డి, కె అచ్యుతరామయ్య, సాయిబాబానాయుడు, తదితరుల సమక్షంలో సూపరింటెండెంట్ విజయకుమార్ బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఒక్కొక్క పాటదారుడు 25 లక్షలను శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి డిపాజిట్‌గా చెల్లించారు. ఐదుగురు పాటదారులు బహిరంగ వేలంపాటలో, ముగ్గురు సీల్డ్ టెండర్లు, ఒకరు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో పాల్గొన్నారు.

మొత్తం 9 మంది కాంట్రాక్టర్లు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. పాట పెరగకుండా కాంట్రాక్టర్లు రింగ్ కావడానికి చేసిన ప్రయత్నాలను దేవస్థానం అధికారులు వమ్ము చేశారు. గత సంవత్సరం ఈ వేలంపాట బోస్ బోస్ సంస్థ కోటి 84 లక్షల 59 వేల 999 రూపాయలకు పాడుకున్నారు. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 47 లక్షల 70 వేల రూపాయలు అధికంగా ఆదాయం సమకూరింది.
పాట కాల పరిమితి ముగిసిన వెంటనే చీరల వేలంపాట విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో ఈ సంవత్సరం ఏప్రిల్ 25 నుండి అమ్మవారికి సమర్పించిన చీరలను శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం సిబ్బందే పోగుచేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ఈ చీరలను పోగు చేసుకునే హక్కును నవంబర్ 1వ తేదీ నుండి లీజుదారునికి అప్పగించనున్నారు. ఈ లీజ్ సంవత్సరంపాటు ఉంటుంది.












Click it and Unblock the Notifications