బోండా Vs పవన్, వివాదం వెనుక - సీఎంఓ ఆరా, కీలక నిర్ణయం..!!
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉమా చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇచ్చారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు.. వివాదం వెనుక జరిగిన పరిణామాల పైన పవన్ ఆరా తీసారు. బొండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయ పడ్డారు. సీఎంకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. అటు సీఎంఓ సైతం ఆరా తీసింది. దీంతో, ఇప్పుడు బోండా ఉమా పై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యల వివాదం కొత్త మలుపు తీసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖకు బాధ్యుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరునూ ప్రస్తావించారు. దీంతో... దీని నేపథ్యం ఏమిటనే కోణంలో అటు పవన్.. ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది. బొండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివ్వెర పరిచాయి. సభలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్యపై బోండా ఉమా వ్యక్తిగత ఆరోపణలు చేశారు.

పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ''పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే.. ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు. నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన (కృష్ణయ్య) చైర్మన్ సీట్లో కూర్చున్నారు. ఆయన పెద్ద పెద్దవాళ్లకు ఏవిధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతోందని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నంలో రాంకీ పరిశ్రమ నుంచి వస్తున్న ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారని పీసీబీ చైర్మనే చెప్పారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఆ కంపెనీ యజమాని వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలని బొండా అన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ సభలోనే గట్టిగా, వివరంగా సమాధానమిచ్చారు.
దీంతో, పవన్ ఈ వివాదం పై పీసీబీ అధికారులను సిలిపించారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. పీసీబీ చైర్మన్‌ను ఉద్దేశించి బొండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం సృష్టం చేశారు.
కాగా, పీసీబీ అధికారులు బొండా తీరును పవన్ కల్యాణ్‌కు వివరించినట్లు తెలిసింది. 'క్రెబ్స్ బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోంది. ఇందులో కొంత బొండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి లేఖ రాశారు. విజయవాడ పోలీసు కమిషనర్‌కూ లేఖ పంపారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలుచేయించారు.
దీంతో పీసీబీ విచారణ చేయించి కంపెనీపై చర్యలకు సమాయత్తమవుతున్న తరుణంలో.. ఆయనే చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై అంతర్గతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు' అని వారు చెప్పినట్లు సమాచారం. బొండా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అటు సీఎంఓ సైతం ఆరా తీయటంతో బోండా పైన ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications