కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు: ఇద్దరు మృతి, మరో ఆరుగురికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లా కాకినాడలోని సర్పవరం టైకి కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది. ఈ పేలుళ్ల ధాటికి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు.
కెమికల్ బాయిలర్ పేలుళ్లకు గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ప్రమాదం జరగడంతో ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకున్నారు.
మంత్రి కన్నబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, నలుగురు గాయపడ్డారని తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. నైట్రిక్ యాసిడ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మిలు పరిశీలించారు.

గుంటూరు ప్రమాదంలో ఇద్దరు మృతి
కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో ఫిబ్రవరి 25న పసుపు బాయిలర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈపూరు రవివర్మ, ఈపూరు కిషోర్, ఈపూరు నాగభూషణం, నిక్కు చంద్రశేఖర్, మూల్పూరు రాజేష్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఐదుగురిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మరణించారు.












Click it and Unblock the Notifications