చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ
ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గం సమావేశం జరుగుతుందా, లేదా అనుమానాలు నెలకొన్నాయి. ఒకపక్క ఎలాగైనా భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో ఉంటే తాజా పరిణామాలు మాత్రం క్యాబినెట్ భేటీపై ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి.
ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి క్యాబినెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి పంపించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం దానిని ఈసీకి నివేదించారు. ఆ తరువాత ఆయన సెలవుపై వెళ్ళిపోయారు. 16 వ తేదీ తిరిగి విధులకు హాజరవుతారు. ఇక ఆదివారం రాత్రి వరకు కూడా ఈసీ నుంచి ఏ విధమైన సమాచారం రాలేదు. దీంతో సోమవారం నాడు అంటే నేడు క్యాబినెట్ భేటీకి సంబంధించి ఈసీ నుండి సమాచారం రావచ్చని భావిస్తున్నారు.

ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగడంతో సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారని, అందువల్ల సోమవారం దానిపై ఈసి స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఈసీ అనుమతికి కనీసం 48 గంటల ముందు అభ్యర్థనను పంపించాలి. ఆదివారం సాయంత్రానికి 48 గంటలు ముగిసింది. సోమవారం సాయంత్రం వరకు ఈసీ నుంచి సమాచారం రావచ్చునని అంటున్నారు. ఒకవేళ సోమవారం సాయంత్రం వరకు అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం అందించి, అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమవుతుందా అన్న అంశం ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. మరో పక్క మరికాసేపట్లో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. వారిద్దరి భేటీ తర్వాత ఏపీ క్యాబినెట్ భేటీ అంశం ఏ మలుపు తిరగనుందో అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications