ఏపీలో తుది ఓటర్ల జాబితా విడుదల-రాజకీయ పార్టీల పంతం నెగ్గిందా ?
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పూర్తి కావడంతో తుది ఓటర్ల జాబితాను ఇవాళ ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ గవర్నర్ ను కలిసిన తర్వాత తుది ఎన్నికల జాబితాను విడుదల చేశారు. అయితే ఇది జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటు జిల్లాల్లో అధికారికంగా విడుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ నెల 12 వరకూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ.. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలను జిల్లాల వారీగా కలెక్టర్లు అధికారికంగా ప్రచురించి విడుదల చేస్తున్నారు. ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను ఇచ్చారు. వీటిలో తాజాగా ఓటు నమోదు చేసుకున్న వారు, మార్పులు చేర్పులు చేసుకున్న వారు పరిశీలించుకునే అవకాశం లభించింది.

రాష్ట్రంలో నకిలీ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు భారీ ఎత్తున జరుగుతోందని, ఇతర రాష్ట్రాల్ల ఓటు హక్కు కలిగిన వారు ఇక్కడ ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ, టీడీపీ ఈసీకి పలు ఫిర్యాదులు చేశాయి. అయితే వీటిలో ఎన్ని ఫిర్యాదులను ఈసీ పరిశీలించి మార్పులు చేసిందనేది తుది ఓటర్ల జాబితాలను పూర్తిగా పరిశీలిస్తే కానీ తెలిసే పరిస్దితి లేదు. దీంతో ఈ జాబితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లా కలెక్టర్లు విడుదల చేసే జాబితాలు లేదా ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసిన జాబితాలను పరిశీలించిన తర్వాత రాజకీయ పార్టీలు దీనిపై స్పందించే అవకాశముంది.












Click it and Unblock the Notifications