ఏపీలో మోగిన ఎన్నికల నగారా: క్లీన్ స్వీప్
AP MLC elections: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నెలన్నర రోజుల వ్యవధిలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మొన్నట్లాగే ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.
ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికోవాల్సిన స్థానాలు ఇవి. దీని కోసం ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జులై 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు.

దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 5వ తేదీ వరకు గడువు ఉంటుంది. 12వ తేదీన పోలింగ్ నిర్వహింనుంది ఈసీ. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు వేయడం వల్ల ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సీ రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగా శాసన మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు.. సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు. వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్‌పైనా వేటు పడింది.
ఫలితంగా- ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అవసరమైంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడం వల్ల టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఈ రెండింటినీ గెలుచుకోవడం ఖాయమైంది. ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. ఈ రెండు కూడా ఏకగ్రీవమౌతాయి.












Click it and Unblock the Notifications