ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలు..షెడ్యూల్ ప్రకటించిన సీఈవో..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. చివరి నిమిషంలో అద్భుతాలు జరిగితే తప్ప వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్ కుమార్ మీనా ఇవాళ వార్షిక ఎన్నికల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం జూలై 21న మొదలయ్యే ఈ కసరత్తు వచ్చే ఏడాది జనవరి 5 వరకూ కొనసాగబోతోంది.
తుది ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ వెల్లడించారు. జూలై 21 నుండి ఆగస్టు 21 వరకూ బి.ఎల్.ఓ.ల ఇంటింటి పరిశీలన ఉంటుందని తెలిపారు.అక్టోబరు 17 న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేపడతారు. అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకూ క్లైమ్ లు మరియు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.

క్లైమ్ లు ,అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిశంబరు 26 కల్లా క్లైమ్ లు ,అభ్యంతరాల పరిష్కారం చేస్తారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుంది. జనవరి 1 కల్లా 18 సంవత్సరాలు నిండే యువత ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 1 కల్లా 18 సంవత్సరాలు నిండే యువత ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవచ్చని, అయితే తదుపరి మూడు మాసాల్లో మరో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతుందని, మార్చి 1 నాటికి నూతనంగా అర్హులైన ఓటర్లు కూడా ఈ జాబితాలో తమ పేరును నమోదు చేయించుకోవచ్చన్నారు.రాష్ట్రంలోని 18-19 సంవత్సరాల యువ ఓటర్లలో జనాభా శాతం ప్రకారం 12 లక్షల యువ ఓటర్లు ఉండాలని, అయితే 3.50 లక్షల యువఓటర్లు మాత్రమే ఉన్నారని, ఈ వ్యత్యాసాన్ని పూరించాల్సి ఉందని ఆయన తెలిపారు.
అదే విధంగా ప్రతి 1000 మంది జనాభాలో 714 ఓటర్లు ఉండటం ఆదర్శనీయమైన సంఖ్య అని అయితే మన రాష్ట్రంలో ఆ సంఖ్య కొంత ఎక్కువగా ఉందని, కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో అయితే ఆ సంఖ్య 750 వరకూ ఉందన్నారు. అటు వంటి చోట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు మరియు ఎటు వంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు గుర్తింపుపొందిన అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సీఈవో కోరారు. ఈ ప్రక్రియలో వారు కూడా భాగస్వామ్యుల అయ్యేలా తమ బూత్ స్థాయి ఏజంట్లను నియమించుకోవాలని కోరారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితా, తుది ఓటర్ల జాబితా మరియు క్లైమ్ లు, అభ్యంతరాల జాబితాలను రెండు ప్రతుల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇస్తామన్నారు.ఆయా జాబితాల్లో వారికి ఎటు వంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే ఆ విషయాన్ని సంబందిత ఇ.ఆర్.ఓ., జిల్లా ఎన్నికల అధికారి, సి.ఇ.ఓ.దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications